ఈరోజు పవిత్ర భీష్మఏకాదశి, షుమారు ఐదువేల సంవత్సరాలపూర్వము శ్రీవిష్ణుసహస్రనామము లోకానికందిన శుభదినము.
శ్రీవేదవ్యాస మహర్షి శ్రీమద్మమహాభారతం రచించారు. మహాభారతానికి రెండింటివలన గౌరవమని విజ్ఞుల అభిప్రాయము. మొదటిది శ్రీకృష్ణపరమాత్మ బోధించిన శ్రీమద్భగవద్గీత, రెండవది శ్రీభీష్మాచార్యులు లోకానికందించిన శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రము. కురుక్షేత్రయుద్ధం ముగిశాక అంపశయ్యపై పరుండిన భీష్మాచార్యులు తమకెదురుగా నిలబడియున్న పాండవులకుపదేశించారు, వారివెనుక శ్రీకృష్ణపరమాత్మ యున్నారు. ధర్మరాజడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్మాచార్యులు ఈస్తోత్రపరంగా శ్రీవిష్ణుమూర్తియొక్క కళ్యాణగుణాలను వివరించారు. ఈస్తోత్రాన్ని భక్తిశ్రద్ధల వినువారలకు, పఠించువారలకు అనేక శుభములుకలుగుననెడిది పెక్కుభక్తుల యనుభవము.
సాక్షాత్తు సద్గురు శ్రీసాయినాథులు తమ ప్రియభక్తుడు శ్యామాకు ఈగ్రంధ మహిమనిలా వివరించారు. " ఓ శ్యామా! ఈగ్రంధము మిగుల విలువైనది. ఫలప్రదమైనది. కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడునేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితమపాయములో నుండెను. అట్టి సందిగ్ద స్థితియందు నేను ఈపుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలుజేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగుజేసేనని యనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయును."
పిదప ఈగ్రంధమును క్రమముగా శ్యామా చదివి దానిలో గొప్పప్రావీణ్యము సంపాదించెను, విద్యావంతులకు సైతము బోధింపగలిగెను.
" భక్తునిజేరుటకు విమానమవసరంలేదు! " , సాయిబాబా " మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
సాయి సర్వాంతర్యామి, అంటే అందరిహృదయాలలో నివసించే దివ్యశక్తి మయుడు. ఈవిషయమై శ్రీసాయిసచ్చరిత్రములో పెక్కు ఉదాహరణలున్నవి, ప్రస్తుత భక్తుల యనుభవంకూడాను. బాబాలీలలు దేశదేశాలు, ఖండఖండాలు వ్యాపించినవనుట నిత్యసత్యము. బాబాభక్తుడు బీ.వీ.దేవ్ తమయింట జరుగు ఉద్యాపన శుభకార్యానికి దయచేసి తప్పకరావలసినదని బాబాకు ఆహ్వానలేఖ పంపగా, దగ్గరున్న జోగు ఉత్తరం చదివి బాబాకు వినిపించాడు. ఆవిషయం విన్నపిమ్మట బాబా యిట్లన్నారు, " నన్నేగుర్తుంచుకొనువానిని నేను మరువను. నాకుబండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్నుప్రేమతో పిలుచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. నీవు, నేను, మరియొకనితో సంతర్పణమునకు వచ్చెదమని వానికి సంతోషము కలుగునట్లు వ్రాయుము." బాబాచెప్పినట్లు జోగు దేవుకు లేఖవ్రాసెను. సంతర్పణము జరుగు రోజున, సరిగ్గాసమయానికి బాబా సన్యాసివేషమున మరిద్దరితోకలిసి దేవునింట భోంచేసి వెళ్లగా, దేవు ఆసంగతి యెరుగడాయెను. ఆపై నిజమెరిగిన దేవు పశ్చాత్తాపపడెను.
మరొక్కసంఘటన నిచట పరిశీలించెదము. బాలారాం మాన్కర్ యనుభక్తుడు బాబాసలహాపై సతారాజిల్లాలోని మచ్చింద్రఘడ్ వెళ్లి యచట తీవ్రంగా ధ్యానంచేయసాగాడు. కొన్నిరోజులపిమ్మట వానికి మెలకువలో బాబాయొక్క భౌతిక దివ్యదర్శనమైనది, తననేల యచటకుపంపారని బాబానడుగుతాడు. బాబా యిట్లు చెప్పారు, " శిరిడీలో అనేకాలోచనలు నీమనసున లేచెను. నీ చంచలమనస్సునకు నిలకడ కలుగజేయవలెనని యిచటకు బంపితిని. నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్నుభావించితివి. నేనెల్లప్పుడు శిరిడీలోనే యుండెద ననుకొంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము శిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచటికి బంపితిని. " ఈవిధంగా బాబా యెలాంటి వాహనాలు లేక శిరిడీనుండి మచ్చింద్రఘడ్ వెళ్లి మాన్కర్ కు దివ్యభౌతిక దర్శనమిచ్చారు.
బాబా యుద్దేశ్యము వేరొకచోట యిలా వివరింపబడినది, " నాముందర భక్తితో మీరు చేతులు చాచినచో వెంటనే రేయి పగలు మీచెంత నేనుండెదను. నాదేహము నిచ్చటయున్నప్పటికి సప్తసముద్రములకవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీచెంతనే యుండెదను. నా నివాసస్థలము మీహృదయమునందే గలదు." శ్రీసాయిసచ్చరిత్రము 15వ అధ్యాయము.
మరియొక సందర్భములో ప్రియభక్తుడు మేఘాకు తెల్లవారుజామున బాబా దర్శనమిచ్చి త్రిశూలము వ్రాయునటుల బలికి యదృశ్యుడయ్యెను. కండ్లుతెరచి మేఘా యచట పడియున్న యక్షతల జూసెను, బాబా కనిపించలేదు. ఈదృశ్యవిషయమును ధృవీకరించుటకై మేఘా బాబానుజేరి త్రిశూలము గీయుట కనుమతియడుగ సాయిబాబా యిట్లనెను, " నామాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యముగాదు, నేను స్వయముగా వచ్చితిని. .... ప్రవేశించుటకు నాకు ద్వారము యవసరములేదు. నాకు రూపములేదు. నేనన్నిచోట్ల నోవసించుచున్నాను. ఎవరైతే నన్నునమ్మి నన్నే ధ్యానింతురో వారిపనులన్నిటిని సూత్రధారినై నడిపించెదను." బాబా సందేశమును పాటించి ఆపై పూనా భక్తుడు తెచ్చిన శివలింగమును బాబానుండి పొంది త్రిశూలముపక్కన స్థాపించెను.
అమెరికా హ్యూస్టన్ నగర భక్తులకు కలిగిన బాబా యనుభవములనీక్రింద పోస్టులలో చూడగలరు.
సాయి ఖండాంతర లీల1 www.saileelatelugu.blogspot.com , dated October 4, 2018
సాయి ఖండాంతరలీల 2 www.saileelatelugu.blogspot.com , dated October 15, 2018
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)